వరుసగా పెద్ద దర్శకులతో ఎన్టీఆర్


యంగ్ టైగర్ జూనియ‌ర్ ఎన్టీఆర్ పుట్టిన రోజు సందర్భంగా సోషల్ మీడియా మోతెక్కిపోతుంది. ఈ సారి కుటుంబ సభ్యులతోనే బర్త్ డే చేసుకున్న ఎన్టీఆర్.. అభిమానులంతా ఇంట్లోనే ఉంటే అదే తనకు పెద్ద కానుక అన్నారు. ఇదిలా ఉంటే సినిమాల పరంగా కూడా తారక్ కెరీర్ పీక్స్‌లో ఉంది. ప్రస్తుతం ఎన్టీఆర్ రాజమౌళి RRR సినిమాతో బిజీగా ఉన్నాడు. ఈ సినిమాతోనే మ‌రో ఆరు నెలల పాటు బిజీగా ఉంటాడ‌న‌డంలో ఎలాంటి సందేహం లేదు. 2021, జనవరి 8న ఈ సినిమా విడుదల కానుందని చెప్పినా లాక్‌డౌన్ ఆ ఆశల మీద నీళ్లు చల్లింది . ఇదిలా ఉంటే రాజమౌళి తర్వాత వరసగా పెద్ద డైరెక్టర్లను ‌రంగంలోకి దించాలని చూస్తున్నాడు జూనియర్ ఎన్టీఆర్.

ఇండ‌స్ట్రీలో ప్ర‌స్తుతం బయటకొస్తున్న వార్త‌ల ప్ర‌కారం ఎన్టీఆర్ త‌ర్వాత మూడు సినిమాలు మాత్రం అగ్ర ద‌ర్శ‌కుల‌తోనే ఉండ‌బోతున్నాయి. ఇప్ప‌టికే వ‌ర‌స విజ‌యాల‌తో దూసుకుపోతున్న ఈయ‌న‌.. RRR త‌ర్వాత త్రివిక్రమ్ శ్రీనివాస్‌ దర్శకత్వంలో సినిమా చేయ‌బోతున్నాడు. ఇప్పటికే ఈ సినిమాపై అఫీషియల్ ప్రకటన కూడా వచ్చింది. ఇదే ఏడాది సినిమా పట్టాలెక్కనుంది. నందమూరి తారకరామారావు ఆర్ట్స్, హారిక హాసిని క్రియేషన్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. దాంతో పాటు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఓ సినిమా ఉండబోతుంది. ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా ప్రశాంత్ నీల్ ఈ విషయం కన్ఫర్మ్ చేసాడు. కెజియఫ్ 2 తర్వాత ఇది కూడా పాన్ ఇండియన్ లెవల్లో ఉండబోతుంది.

మరోవైపు తమిళ దర్శకుడు అట్లీ కుమార్ ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా చేయ‌బోతున్నాడు ఎన్టీఆర్. ఈ విషయాన్ని అట్లీ కుమార్ కూడా కన్ఫర్మ్ చేసాడు. త్వరలోనే తెలుగు సినిమా చేయబోతున్నానని.. అది కూడా తనకిష్టమైన ఎన్టీఆర్‌తో అని ఈ మధ్యే చెప్పాడు అట్లీ. ఇప్ప‌టికే త‌మిళ‌నాట వ‌ర‌స విజ‌యాల‌తో సంచ‌ల‌నాలు సృష్టిస్తున్నాడు ఈ కుర్ర ద‌ర్శ‌కుడు. మొన్న బిగిల్ సినిమాతో ఏకంగా 300 కోట్లు వసూలు చేసాడు అట్లీ. అన్నీ కుదిర్తే అశ్వినీ దత్ బ్యానర్‌లోనే ఈ చిత్రం ఉండబోతుంది. ఇప్పటికే దీనిపై నిర్మాత అశ్వినీ దత్ కూడా క్లారిటీ ఇచ్చాడు. ఎన్టీఆర్ సినిమా చేస్తానని అనౌన్స్ చేసాడు ఈయన.

ఎన్టీఆర్ తన కెరీర్ గ్రాప్ పడిపోకుండా జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటున్నాడు. ఎందుకంటే గతంలో రాజమౌళితో సింహాద్రి, యమదొంగ లాంటి సినిమాలు చేసిన తర్వాత ఒక్కసారిగా జూనియర్ కెరీర్ అంతా డైలమాలో పడిపోయింది. వరస అపజయాలు ఈయన్ని బాగా ఇబ్బంది పెట్టేసాయి. అందుకే ఇప్పుడు RRR త‌ర్వాత త్రివిక్రమ్ శ్రీనివాస్‌, అట్లీ కుమార్, ప్ర‌శాంత్ నీల్ లాంటి సంచ‌ల‌న ద‌ర్శ‌కుల‌ సినిమాలు చేయ‌డానికి ఎన్టీఆర్ సిద్ధ‌మ‌వుతున్నాడు. ఈ సినిమాలు కానీ వర్కవుట్ అయితే ఎన్టీఆర్ రేంజ్ మరింత పెరిగిపోవడం ఖాయం.

0/Post a Comment/Comments

Previous Post Next Post